19/08/2026
తులసీదాస్ జయంతి :
తులసీదాస్ రచించిన రామచరిత మానస్ ను ఉత్తరాదివారు నిత్యం పారాయణ చేస్తుంటారు. పరమశివుడు తన మనస్సులో రచించుకున్న రామాయణం ఇది. అందుకే తులసీ రామాయణం అంతా శివుడు పార్వతికి ఉపదేశించినట్లుగా ఉంటుంది. తులసీదాసు 'మానస్' శబ్దాన్ని మానస సరోవరంగా అన్వయించారు. సప్తసోపానాలంకృతమైన శ్రీరామకీర్తిని సరోవరంగా చిత్రీకరించారు. ఇందులో శివపార్వతి సంవాదం, భుశుండి గరుడ సంవాదం, యాజ్ఞవల్క్య భరద్వాజ సంవాదం, తులసీదాసూ ఆయన శిష్యుల సంవాదం ఇలా ప్రసిద్ధమైన నాలుగు సంవాదాల రూపంలో కథ నడుస్తుంది. తులసీదాసు 'రామచరితమానస్' రచనకు దోహా, చౌపాయీ అనే రెండు ఛందస్సులను విరివిగా ఉపయోగించాడు. రెండేసి దోహాల మధ్య నాలుగేసి చౌపాయీలను రాయడం తులసీదాసు శైలి. ఇవిగాక నాలుగు పంక్తుల ఛందమనే మరోవృత్తం, రెండు పంక్తుల సోరఠ అనే లఘువృత్తం అక్కడక్కడా ఉపయోగించాడు. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, అంత్యప్రాస, అనుప్రాస వంటి విశిష్ట అలంకారాలతో రామచరిత మానస్ శోభిస్తోంది. ప్రతికాండకు ప్రారంభంలో ప్రార్థనాశ్లోకాలు సంస్కృతంలో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఆ కాలంలో లోపించిన సదాచారం, శీలసంపదలను పునఃప్రతిష్ఠ చేయడమే తులసీదాసు రామాయణ రచనకు ప్రధాన లక్ష్యం. అందుకే సీతాదేవి అగ్నిప్రవేశ ఘట్టానికి ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చాడు. వాల్మీకిలో లేని అనేక మౌలిక కల్పనలు రామచరిత మానస్ నిండా కనిపిస్తాయి. తనలోని అజ్ఞానాంధకారం తొలగేందుకే దేశభాషలో రామాయణం రచిస్తున్నానని ఆయన చెప్పుకున్నాడు. రామచరితమానస్ కావ్యం నిండా భక్తివైరాగ్యాలను, పరబ్రహ్మతత్త్వాన్ని, మానవ ధర్మాలను విలువలను తులసీదాసు వర్ణించిన తీరు అమోఘం, అద్వితీయం.