ప్రస్తుత ప్రపంచానికి ధర్మం మరియు జ్ఞానం అవసరమని, నా అంతర్ దృష్టి ఎప్పుడూ నాకు తెలియజేస్తూనే ఉంటుంది. ఈ సత్యాన్ని అంగీకరించే మొదటి వ్యక్తి మనమే అవ్వాలి. సహజంగా జీవితం చాలా చిన్నది మరియు సరళమైనది, కానీ మనం మన ఆలోచనలతో దానిని సంక్లిష్టంగా మార్చుకుంటున్నాము. అది భారీ అంచనాలకు దారితీస్తుంది. తద్వారా చాలా నష్టం జరుగుతుంది.
నా జీవితం విభిన్న భావాజాలాలు కలిగిన వ్యక్తులను కలుసుకోవడానికి దారితీసే పరిస్థిత
ులను కలగజేసి, అనేక ప్రదేశాలను సందర్శించేలా చేసింది. క్లిష్ట పరిస్థుతులను ఎదుర్కునేలా చేసి, అంతు చిక్కని ప్రశ్నల సమూహంలో వదిలేసింది. సందర్భానుసారంగా ఎన్నో రకాలైన ఉదాహరణల ద్వార, కొన్ని ప్రశ్నలకు సమాధానాలను మరలా మరువని విధంగా సమాధాన పరిచింది. పిలిచే పేరులకి, కనిపించే దేహాలకి విలువనివ్వకుండా ఆ రెండిటి వెనుక దాగి ఉన్న సంకల్పానికి విలువనిస్తూ పయనిస్తే, ఆ ప్రయాణమే అన్ని ప్రశ్నలకు సమాధానమవుతుందని ఎన్నొ సందర్భాల్లో తెలియజేసింది.
పేరు, దేహం లేని ఆ ప్రపంచం ఎలా ఉంటుందొ ఊహకి అందుతున్నా, ఆ ప్రయాణం ఎంత అపురూపమైనదో తెలియజేసినా, బలహీనతలకు లొంగే నా మనసుని ఏమీ చేయలేని నా నిస్సహాయత నన్ను ఎప్పుడూ బాధిస్తూనే ఉంటుంది. మనసుకి, వివేకానికి మధ్యన జరిగే ఆ సంఘర్షణ ఎటు తీసుకు వెళుతుందా అని ఎదురుచూస్తున్నాను.